Saturday, July 10, 2010

జనం గుండె చప్పుడు జగన్ కావాలి సిఎం.... ఇదే కాంగ్రెస్ శ్రేణుల ఆశయం

(వైఎస్సార్ మరణం తర్వాత జనహృదయస్పందన మేరకు రాసిన కధనం) 
జనం మెచ్చిన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించాలంటూ కాంగ్రెస్ శ్రేణులన్నీ గళమెత్తి నినదిస్తున్నాయి. గురువారం రాత్రి జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ అధిష్టానాన్ని కోరింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేయాలని పలువురు మంత్రులు ప్రతిపాదించగా అతికొద్దిమంది మాత్రం ఇది సరైన సమయం కాదని వారించారు. అయితే వైఎస్ విధేయులైన కొందరు మంత్రుల సారధ్యంలో పలువురు తమ మనోభావాన్ని ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్పమొయిలీ కి వివరించారు. తమ ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని వారంతా ముక్తకంఠంతో విన్నవించారు. ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన రాజశేఖరరెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ పార్టీని విజయపధంలో నడిపించారని వైఎస్ ను అభిమానించే మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. జగన్ ను సిఎం చేయడం ద్వారా వైఎస్ త్యాగానికి, సేవలకు పార్టీ తగిన గుర్తింపు ఇచ్చినట్లు కాగలదని వారంటున్నారు. అంతే కాకుండా వైఎస్ ఆశయాలను సాకారం చేసే క్రమంలో కూడా జగన్ ఎంపిక కీలకం కాగలదని, దీర్ఘకలికంగా ఇది పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు.
      రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఏకగ్రీవంగా కోరుతున్నారు. మరో పక్క పార్టీ ఎమ్మెల్యేలందరూ జగన్ కు మద్దతుగా సంతకాల ఉద్యమం చేపట్టారు. కొన్ని గంటల్లోనే దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రజాప్రతినిధుల మద్దతు విషయం  ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, పార్టీ అభిమానులంతా ఒకే గొంతుతో జగన్ ను సిఎం చెయ్యాలని నినదిస్తున్నారు. కార్యకర్తల నుంచి కూడా జగన్ కు మద్దతుగా సంతకాల సేకరణ చేపడితే  కోట్లాదిమంది సంతకాలు చేస్తారని పలువురు విశ్వసిస్తున్నారు. ఈ పరిణామాలను, వీటిలో ఇమిడి ఉన్న ప్రజల సెంటిమెంటును గమనించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా సిఎం పదవికి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయం ప్రకారం నూటికి 98శాతం మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వమే శరణ్యమని వారంతా నమ్ముతున్నారు.
       అయితే కొంతకాలంగా రాజశేఖరరెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్న జెసి దివాకరరెడ్డి, శశిధరరెడ్డి, జానారెడ్డి లతో పాటు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా జగన్ సిఎం కాకుండా అడ్డు పడాలని భావిస్తున్నారు.. పార్టీలో సీనియర్ నేతలకే సిఎం పదవి కట్టబెట్టాలని అంతర్గతంగా వీరు కోరుతున్నారని సమాచారం.  అయితే వైఎస్ అనుకూల వర్గం వీరి ఆంతర్యాన్ని ముందే పసిగట్టింది. అందుకే ప్రజాస్వామ్య బద్ధంగా అందరి మద్దతునూ కూడగట్టడం ద్వారా తమ డిమాండ్ ను చట్టబద్ధంగా వర్కింగ్ కమిటీ ముందు ఉంచాలన్న వ్యూహంతో వారు ముందుకు సాగుతున్నారు. వీరి ప్రయత్నాలకు వర్కింగ్ కమిటీ లోని కొందరు సభ్యుల సహకారం కూడా ఉండటంతో జగన్ ను వ్యతిరేకించే వారి వాదన వీగిపొయే అవకాశాలు బలపడు తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆశీస్సులందుకున్నవారిదే నాయకత్వం తప్ప అందరికీ ఆమోదయోగ్యులు ఉండరన్న అపప్రధ కూడా జగన్ విషయంలో ఉండదని, ఆయనను పార్టీ సమస్తం కోరుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు.
     ఆజన్మాంతం ప్రజా సంక్షేమానికి, తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేసిన దివంగత రాజశేఖర రెడ్డి రాజకీయ వారసునిగా జగన్ ఇప్పటికే జనామోదం పొందారు. మూడున్నర మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో కడప ఎంపి గా ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. చారిటబుల్ ట్రస్ట్, యువసేన వంటి వేదికల ద్వారా జగన్ రాష్ట్రవ్యాప్తంగా యువశక్తిని అకర్షించి సేవారంగం వైపు మళ్ళిస్తున్నారు. లక్షలాదిమంది యువకులు జగన్ పేరిట నడుస్తున్న సంస్థలలో చేరి తమ రాజకీయచైతన్యాన్ని, సేవానిరతిని చాటుతు న్నారు. తన విలక్షణవ్యక్తిత్వం, విశిష్టదృక్పధం ద్వారా జగన్ సిఎం కుమారునిగానే కాకుండా, సొంతంగా కూడా తనకంటూ ఇమేజ్ ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా యువతకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా, ఆరాధ్యనాయకునిగా నిలిచారు. గత ఎన్నికల్లో గొప్ప జనాదరణ కలిగిన సినిమా హీరోల సభలతో పోటీ పడి జగన్ సభలు విజయవంతం అయ్యాయి. గట్టి పోటీని, సొంత పార్టీలో అసమ్మతులను తట్టుకుంటూ పార్టీని ఒంటిచేత్తో గెలిపించేందుకు ప్రయాస పడిన తండ్రికి బాసటగా నిలిచిన జగన్ "పులిబిడ్డ" అనిపించుకున్నారు. రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించే జగన్ చేతల మనిషిగా పేరొందారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను మోస్తూ పదుగురికీ ఆదర్శంగా నిల్చారు. సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తగా, సంచలనాల పత్రికా సారధిగా ఆయన విజయాలు అనన్యం. కడప ఎంపిగా ఎన్నికైన వెంటనే సామాన్యుల పక్షాన నిత్యావసరాల ధరలపై పోరాడిన జగన్ ఉదాత్త శైలి ఆయనను ప్రజల మనిషిని చేసింది. కార్యకర్తలు, నాయకుల ఆకాంక్షలు సిద్ధించి జగన్ ముఖ్యమంత్రి అయితే తండ్రి బాటలో నడిచి ఆర్తులకు ఆపన్నహస్తం అందిస్తాడన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా, లోకప్రియనేతగా మన్నన లందుకోవడం జరిగినట్లే జగన్ కూడా రాజశేఖరుని వారసత్వం నిలబెట్టి భేష్ అనిపించుకుంటాడని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు.

No comments: