Saturday, July 10, 2010

మంత్రులు అక్కడ... కుటుంబాలు ఇక్కడ!! జగన్ యాత్రకు నేతల పరోక్ష మద్దతు


జగన్ ఓదార్పు యాత్రలో ఎంత పాల్గొనాలని ఉన్నా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు వీలు కావడంలేదు. అధిష్టానం ఏమంటుందోననే భయం, సీఎం వద్ద తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న ఆందోళన, అసెంబ్లీ తాలూకు బిజీ షెడ్యూల్ కారణంగా వారు దూరంగా ఉండిపోయారు. అయితే వారిలో చాలామందికి మనసంతా యాత్రపైనే ఉంది. దీంతో వారందరూ తమ అనుచరుల్ని, ద్వితీయ శ్రేణి పార్టీ నేతల్ని, కుటుంబ సభ్యులని జగన్ యాత్రకు పంపుతున్నారు. ఇందుకు ఉదాహరణగా రెండో రోజు ఓదార్పు యాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యుల హడావుడిని పేర్కొనవచ్చు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామమనోహర్‌నాయుడు హైదరాబాద్ నుంచి హుటాహుటిన టెక్కలి చేరుకొని ఈ యాత్ర పొడవునా జగన్‌కు తోడుగా ఉన్నారు. నరసన్నపేట పట్టణంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు నరసన్నపేట ఎంఎల్ఏ ధర్మాన కృష్ణదాస్‌ల ఫోటోలతో ప్లెక్సీ బ్యానర్లు కట్టారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతోందంటూ ఎంఎల్ఏ కష్ణదాస్ నరసన్నపేటలో నాయకులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఓదార్పు యాత్రలో జగన్‌తోపాటు ఎంఎల్ఏ కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, కుమారుడు రామలింగంనాయుడు వారి అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కంటి మీద కునుకు లేకుండా యాత్రను కొనసాగిస్తూ తీవ్రంగా అలిసిపోతున్న పరిస్థితిలో కూడా జగన్ ఈ వాస్తవాన్ని విస్మరించడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వెనుక ఉన్న ముఖ్య నేతలు, వారి వారి అనుచరుల ప్రోత్సాహంతోనే తన యాత్ర ఇంతగా విజయవంతమవుతోందన్న విషయాన్ని జగన్ మననంలో ఉంచుకున్నారు. జిల్లాలో లేకపోయినప్పటికీ ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల గృహాలకు వెళుతూ జగన్ వారి ప్రాధాన్యతను గౌరవిస్తున్నారు.

No comments: