Saturday, July 17, 2010

ఓదార్పుకి తూర్పులో వచ్చింది ఊపు

 మొయిలీ ప్రకటనతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు
నాడు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి అస్వస్థతకు గురైంది తూర్పుగోదావరి జిల్లాలోనే. పదిరోజులకు పైగా ఆయన రాజమండ్రిలోని ఓ తోటలో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత యాత్ర కొనసాగించారు. ఇక అప్పటినుంచి ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా సింపతీ వెల్లువెత్తింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సెంటిమెంట్ గా తూర్పులో ఓదార్పుయాత్ర కలిసొచ్చింది. ఓదార్పు యాత్ర అధిష్టానానికి వ్యతిరేకమని కొందరు, దీనిపై జగన్ కు షోకాజ్ నోటీసులిచ్చారని ఇంకొందరు ప్రచారం చేస్తూ జగన్ పార్టీని వదిలేస్తారని నానా కంగాళీ సృష్టించారు. ఈ గందరగోళం మధ్య ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మొదటి అంకంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా యాత్రకు మొహం చాటేశారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ని అధిష్టానం చివాట్లు పెట్టిందని కూడా ప్రచారం లేవదీశారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధంకాని వాతావరణాన్ని సృష్టించి పారేశారు. అయితే తూర్పున నాలుగోరోజు యాత్ర నాటికల్లా ఈ అనుమాన మేఘాలు వీడిపోయాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలుండవని మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. జగన్ పై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపిస్తుందనే ఊహాగానాలకు మొయిలీ ప్రకటనతో తెరపడింది. జగన్ ఓదార్పు యాత్ర శుక్రవారం రాత్రి రాజమండ్రి చేరేటప్పటికే ఈ ప్రకటన రావడం, ఎమెల్యేలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగిఫోయాయి.  మొయిలీ ప్రకటనతో పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జగన్ ను కలుసుకున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కేంద్రమంత్రి పళ్ళంరాజు, ఎంపీ ఉండవల్లి, రాష్ట్రమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొనడంతో యాత్రపై పార్టీ శ్రేణుల్లో మరింత ఆదరణ పెరిగింది.

యువనేత జగన్ కు రాజమండ్రి ఆత్మీయ స్వాగతం


యువనేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు రాజమండ్రి నగరం లో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు యువకులు పోటీలు పడ్డారు. తనపట్ల వెల్లువలా చూపుతున్న ప్రజాభిమానానికి యువనేత చలించిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తాడితోట ఏరియాలో వేలాదిమంది ఆయనకు స్వాగతం పల్కారు. అక్కడ వైఎస్సార్ బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. క్వారీ మార్కెట్ వద్ద వైఎస్ విగ్రహావిష్కరణకు వచ్చిన జగన్ కు అభిమానులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ మరణంతో కలత చెంది మృతుడైన నరసింహమూర్తి కుటుంబానికి ఓదార్పునిచ్చే నిమిత్తం అన్నపూర్ణమ్మపేట జంక్షన్ కు చేరుకున్న జగన్ కు మహిళలు బొట్టు పెట్టి పూలు జల్లుతూ హారతులిచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. నరసింహమూర్తి కుటుంబాన్ని జగన్  ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్రకు తూర్పుగోదావరి జిల్లాలో అపరిమితమైన జనాదరణతో పాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెద్దయెత్తున లభించింది. మొదట ఆరుగురు ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్ర లో పాల్గొన్నారు.ఆ తరువాత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇంత ఆదరణ చూస్తే ఆశ్చర్యమేస్తోంది

కడప ఎం.పీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి పిల్లి.సుభాష్ చంద్రబోసు అన్నారు.ఆయన ఓదార్పు యాత్ర లో మీడియా తో మాట్లాడుతూ జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ కి లాభమే కాని నష్టమేమి లేదన్నారు.నిజం చెప్పాలంటే పార్టీ కి అదనంగా పది ఓట్లు వస్తాయే కాని ఓట్లు పోవన్నారు.
మంత్రి సుభాష్ చంద్రబోసు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి దివంగత నేత వై.ఎస్.ఆర్ విదేయుడనని చెప్పారు. ఆయన మరణ వార్త విని మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ ఓదార్పు యాత్ర లో పాల్గొనటం తన కనీస ధర్మమని అన్నారు. ఓదార్పు యాత్రకు తెల్లవారుజామున రెండు గంటలకు కూడా జనం నుంచి లభిస్తున్న విశేష స్పందన, ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నదని ఆయన అన్నారు