Wednesday, April 27, 2011

సాక్షి లో పెయిడ్ ఆర్టికిల్స్ ట !

ఎన్నికల సంఘం సాక్షి టివీఛానల్ లో ప్రసారమైన, పత్రికలో ప్రచురితమైన తొమ్మిది ఆర్టికిల్స్ ను పెయిడ్ ఆర్టికిల్స్ గా పరిగణించామని ఎన్నికల ముఖ్య అధికారి బన్వర్ లాల్ చెప్పడం విశేషంగా ఉంది. వీటిలో పెయిడ్ ఆర్టికిల్ అంటే నిర్వచనమేమిటో తెలియదుకాని ఇది కొంత ఆసక్తిగానే ఉంది. జిల్లా స్థాయిలో ఉండే ఒక సమన్వయ కమిటీ వీటిని గుర్తించి సిఇఓకి తెలియచేసింది. ఇవి కనుక పెయిడ్ ఆర్టికిల్ప్ అని తేలితే ఆ ఖర్చును అభ్యర్ధి ఖాతాలో జమ చేస్తారు.ఇక్కడ విషయం ఏమిటంటే సాక్షి ఛానల్ కాని, పత్రిక కాని రెండూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డివే.అలాంటప్పుడు ఆయనకు అనుకూలంగా వేసే వార్తలే అనండి, ఆర్టికిల్సే అనండి వాటికి డబ్బు ఎవరిచ్చారని చెబుతారు. జగన్ తన పత్రికలో తానే
డబ్బిచ్చి అది కూడా అనధికారికంగా వేసుకుంటారా.? ఇందులో లాజిక్ అర్ధం కావడం లేదు. మరి ఇతర ఛానళ్లలో ఆయా పార్టీలకు అనుకూలంగా అనేక వార్తలు వస్తున్నాయి. అవన్ని పెయిడ్ న్యూస్ కిందకు రావా? దానిని ఎవరూ గుర్తించలేదా? అలాగే ఇంకో విషయం జగన్ మీడియాలో కాంగ్రెస్,తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతుంటే, జగన్ ప్రత్యర్ధి మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం జరుగుతోది. కేవలం పాజిటివ్ వార్తలనే పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తారా? లేక నెగిటివ్ వార్తలను కూడా తీసుకుంటారా అన్నది తేలాలి. కాగా టిడిపి బృందం ఇప్పటికే సాక్షిపై ఎన్నికల సంఘం వరకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చింది. అందులో జరిగే జగన్ ప్రచారం అంతటిని జగన్ ఖాతాలో వేయాలని కోరింది. అదే ప్రకారం మిగిలినవాటిలో జరిగే ప్రచారాన్ని కూడా తీసుకోవాలి కదా.నిజానికి జగన్ కు సాక్షి లో ప్రచారం జరగడం లేదని ఎవరూ అనరు.కాని పెయిడ్ న్యూస్ గా ఎలా నిర్ధారించారన్నదే అర్దం కాకుండా ఉంది. లేదా ఫలానా వార్తలను ప్రసారం చేస్తే పెయిడ్ న్యూస్ అవుతాయని ఎన్నికల సంఘం ఎక్కడైనా చెప్పిందా? ఇందులో కాస్త స్పష్టత కొరవడినట్లుగా ఉంది.

కర్టెసీ : కొమ్మినేని శ్రీనివాసరావు

Monday, February 7, 2011

జగన్ హరితయాత్రకు వెల్లువెత్తిన రైతన్నలు


రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాలకూ మేలు చేకూర్చే వరం పోలవరం. దశాబ్దాలుగా ఇది కలగానే మిగిలింది. కానీ  వైఎస్ రాజశేఖరరెడ్డి అపరభగీరధుడై ఈ కలకు ప్రాణప్రతిష్ట చేశారు. పనులు పరుగులు తీశాయి. కానీ ఆయన మరణంతో ఈ ప్రాజిక్ట్ పనులు మళ్ళీ పడకేశాయి.  తర్వాత రాజకీయం పడగనీడన రైతు సంక్షేమం బలైంది. అయితే మహానేత ఆశయం అనాధ కాలేదు. జననేతగా రూపాంతరం చెందిన యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు, పోలవరం నిర్మాణానికి  యంత్రాంగాల్ని కదిల్చేందుకు, రాజన్న కలల్ని సాకారం చేసేందుకు నడుం బిగించారు. పోలవరం సాధన కోసం హరిత యాత్ర సుమారు పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర నాలుగు రోజులపాటు సుమారు 70 కిలోమీటర్ల మేర సాగనుంది. 10న పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం వద్ద బహిరంగ సభతో ముగిసే ఈ యాత్రకు లక్షలాదిగా రైతులు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రాత్రి, పశ్చిమగోదావరిలో రెండు రాత్రులు ఆరుబయటే షామియానాలలో యువనేత బస చేయనున్నారు.
సోమవారం ఉదయం యువనేత రాజ మండ్రి రివర్‌బే హోటల్ నుంచి బయల్దేరి ధవళేశ్వరం మీదుగా రావులపాలెం వెళ్ళారు. కళా వెంకట్రావు సెంటర్‌లో వైఎస్ విగ్రహం ఆవిష్కరించారు. వైఎస్, కళా వెంకట్రావు విగ్రహాలకు పూల మాలలు వేసి ప్రజలనుద్దేశించి ప్రాధాన్యాన్ని వివరించారు. భక్తాంజనేయ ఆలయంలో పూజలుచేసి అద్వితీయ రీతిలోపాదయాత్ర ప్రారంభించారు.
రైతు సమస్యలపై పోరుకు యువనేత భారీ, వినూత్న పోరాటాలకు తెరతీశారు. కృష్ణాతీరంలో లక్ష్య దీక్ష,  ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై జల దీక్ష, నిత్యావసర ధరలపై విశాఖ తీరంలోజన దీక్ష చేసి పాలకుల్ని గడగడలాడించిన జగన్ ఇప్పుడు హరిత యాత్ర పేరుతో పోలవరం సాధనకు అడుగులేస్తున్నారు. దీంతో మరో ప్రజా పోరాటానికి తెరతీశారు. గత మూడు దీక్షలకూ అశేషంగా హాజరైన రైతులు, ప్రజలు, అభిమానులూ ఈ యాత్రకు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి ముందుకు వస్తున్నారు. యాత్ర సాగే ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా రైతాంగం యావత్తూ పదం కలుపుతోంది. యువనేతతోకలిసి కదం తొక్కనుంది.
ఇప్పుడు రాష్ట్రమంతా ఏ నోట విన్నా యువనేత హరిత యాత్రపైనే చర్చ. రెండు జిల్లాల్లో నేతలు, రైతుసంఘాల సమన్వయంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి యాత్రకు సమన్వయకర్తగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, ఆళ్ల నాని, టి. బాలరాజు, ప్రసాదరాజు, మాజీ మంత్రులు ఇందుకూరి రామకృష్ణంరాజు, జక్కం పూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, శ్రీరంగనాథరాజు, మోషేన్‌రాజు, వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు హరిత యాత్ర ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
పాదయాత్ర ముగింపు సభ జరగనున్న పోలవరం స్పిల్‌వే ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా సుమారు 30 ఎకరాలను సభకోసం సమకూర్చారు. ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ ఎస్. రామకృష్ణారెడ్డి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్లపై చర్చించారు. రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చే రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ సభను మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించనున్నామని కరుణాకరరెడ్డి తెలిపారు.

యాత్ర రూట్ ఇదీ...
* ఏడో తేదీ(తొలి రోజు) యాత్ర రావులపాలెంలో ప్రారంభమవుతుంది. ఊబలంక, మెర్లపాడు, లొల్ల, ఆత్రేయపురం, ఉచ్చిలి, పులిదిండి, వొట్టిపాలెం, వెలిచేరు, రాజవరం గ్రామాల మీదుగా పేరవరం చేరుతుంది. జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.
* ఎనిమిదో తేదీ(రెండో రోజు) యాత్ర పేరవరం నుంచి బయలుదేరుతుంది. బొబ్బర్లంక, కాటన్ బ్యారేజి, ధవళేశ్వరం, రాజమండ్రి ఆల్కాట్ తోట, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్ సెంటర్, రోడ్ కం రైలు వంతెనల మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది. యువనేత రాత్రికి కొవ్వూరులో బసచేస్తారు.
* తొమ్మిదో తేదీ(మూడో రోజు) కొవ్వూరు నుంచి బయలుదేరే యాత్ర కాపవరం, ధర్మవరం, ములకపల్లి, పెద్దేవం, బల్లిపాడు, వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక, తాడిపూడి మీదుగా గూటాల చేరుకుంటుంది. జగన్ రాత్రికి గూటాలలో బస చే స్తారు.
* పదోతేదీ(చివరి రోజు) యాత్ర గూటాలలో ప్రారంభమై కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ, కన్నాపురం జంక్షన్, బంగారమ్మపేట మీదుగా పోలవరం చేరుకుంటుంది. అక్కడి ప్రాజెక్టు స్థలంలో జరిగే బహిరంగ సభలో జగన్ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది.



Monday, December 27, 2010

ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరిన యువనేత జగన్

రెండురోజుల నిరాహార దీక్షకు రాష్ట్రంమొత్తాన్ని కదిలించి సంచలనం సృష్టించిన యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా తన పోరు ఆపదల్చుకోలేదు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాత రైతు ఎజెండానే ప్రధానంగా ఉంటుందని, తాను కూడా తండ్రి వైఎస్సార్ లాగే రైతు బాంధవుడ్నని ఆయన చాటుతున్నారు. తాజాగా జగన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంటు కోరారు. బహుశా 28,29 తేదీల్లో ఆయన డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తారు. అప్పటికి ఆయనకు అప్పాయింట్ మెంట్ కూడా వస్తుదని అంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో జగన్ ప్రధానిని కలుస్తున్నారు. కాగా రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. కేంద్రం చొరవ చూపి బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరనున్నారు. కాగా రైతు సమస్యలపై తన వ్యవహార శైలితో ఇప్పటికే ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ ఢిల్లీ యాత్ర, ప్రధానితో భేటీ తలనొప్పి తెస్తాయనడంలో సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ చాతుర్యం... కాంగ్రెస్ అధినేత్రికి ఇరకాటం

ఏకపక్షంగా నియంతృత్వ శైలిలో జగన్ విషయంలోవ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇపుడు తల పట్టుకుంటున్నారు. తన వీర విధేయుల చెప్పుడు మాటలు పట్టుకుని నిజమైన ప్రజాదరణ ఉన్న నేతలను నిరాదరించడం ద్వారా పొరపాటు చేసిన విషయాన్ని కొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె దృష్టికి తెచ్చారని అంటున్నారు. వీరిలో ప్రణబ్ ముఖర్జీ ముఖ్యులు. జగన్ విషయంలో ఆంతరంగికులు కొందరు అమెను తప్పుదోవ పట్టించారని, అయితే సోనియా కూడా వారికే విలువ ఇచ్చి జగన్ విషయంలో ఎందుకో తొందర పడ్డారని పార్టీ ముఖ్యులతో అన్నారని సమాచారం. ఈ విషయం సోనియా కోటరీలో ఇపుడు చర్చనీయాంశమైంది. వైఎస్ వ్యతిరేక వర్గం పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారానికి సోనియా ప్రభావితమయ్యారని, వైఎస్ కుటుంబం పార్టీకి చేసిన సేవల్ని హైకమాండ్ అసలు పట్టించుకోకపోవడం శోచనీయమని కొందరు పేర్కొంటున్నారు. పార్టీలో, కడప నియోజకవర్గంలో జగన్‌ను ఏకాకి చేసేందుకు హైకమాండ్ ఎత్తుగడ వేస్తే, ఇది సకాలంలో గ్రహించిన జగన్ అధిష్టానానికే దిమ్మదిరిగేలా తన రాజకీయ చాతుర్యం చూపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో, ఆత్మరక్షణలో పడింది. రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పేరు తల్చుకుంటేనే అధిష్టానానికి వణుకు పుడుతోంది. గతంలో కాంగ్రెస్ పై తోక ఝాడించిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు, ఇవాల్టి జగన్ కు ఏదో అంతరం స్పష్టంగా గోచరిస్తోంది. అతడిలో ఏదో పవర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కట్టి పడేస్తోంది. దిక్కుతోచక తలపట్టుకునేల చేస్తోంది. చివరికి బహిరంగ వ్యఖ్యలు చేసిన కొండా సురేఖ, పిల్లి సుభాశ్ చంద్రబోస్, సబ్బం హరి వంటి నేతల్ని కూడా ఏమీ చేయలేని క్రియాశూన్యత అధిష్టానాన్ని పీడిస్తోంది. సొంత పార్టీ స్థాపనకు జగన్ సన్నాహాలు ఇంకా పూర్తి కాకుండానే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం కొట్టుమిట్టాడుతోంది. జగన్‌కు తన మద్దతు ఉంటుందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బహిరంగంగా ప్రకటించారు.అధిష్టానం తనను వివరణ కోరిన అర్థ గంటలోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆయనతో కలసి రైతులను పరామర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టబోతున్న వ్యక్తితో కలసి తిరుగుతున్నా నాయకత్వం ప్రేక్షకపాత్ర వహించాల్సివచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి కూడా జగన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించినా ఏం చేయలేక పోయింది. పైగా వీరిద్దరితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా మాట్లాడి కూడా మనసు మార్చలేకపోయారు. కనీసం రాజీనామా చేయొద్దని మాత్రం సీఎం వీరిని వేడుకోవలసి వచ్చింది. తెలంగాణకు జై అంటే జగన్ కు తిరుగు ఉండదని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి చెప్పడం మరో సంచలనం. పైగా జగన్ పార్టీ విధివిధానాలు నచ్చితే పార్టీలో చేరుతానని కూడా దామోదర్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఎమ్మెల్యే కొండా సురేఖ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజారక్షణ-భద్రత కమిటీ మాజీ ఛైర్మన్‌ కేవీపీ.రామచంద్రరావును బ్రోకర్‌గా సంబోధించారు. వైఎస్ హత్యలో ఆయనకు ప్రమేయం ఉందన్నారు. అయినా సరే అధిష్టానం మిన్నకుండి పోయిందేగానీ, కనీసం షోకాజ్‌ నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయింది. జగన్‌ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని సురేఖ అంటే కనీసం పీసీసీ ఆమెను మందలించిన దాఖలాలు కూడా కనిపించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకున్నా ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న భయం నాయకత్వాన్ని వేధిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వారికి ప్రధానంగా మారిపోఇంది. జగన్‌వైపు ఎంపీలు వెళితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇబ్బందిలో పడుతుందోనని కాంగ్రెస్ బెదిరిపోతోంది.

Tuesday, December 21, 2010

జనసంద్రంలో ప్రతిధ్వనించిన జగన్నినాదం

లక్షలాది మంది రైతన్నల పదఘట్టనలతో విజయవాడ దద్దరిల్లింది.. బెజవాడ జనవాడగా మారింది. క్రిష్ణమ్మ జనసంద్రమైంది. తాము ఓటేస్తే గెలిచి తమను పట్టించుకోని సర్కారు తీరుపై నిరసన నినాదం రణన్నినాదంలా కాదు జగన్నినాదంలా మార్మోగింది.. తమ తరఫున పోరాడుతున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా వచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులతో మంగళవారం బెజవాడ అణువణువూ నిండిపోయింది. లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే... తొలిరోజే రెండు లక్షలకుపైగా జనం తరలివచ్చి ఆయనను విజయీభవ అని ఆశీర్వదించారు. కృష్ణా తీరాన ఏర్పాటు చేసిన వైఎస్సార్ దీక్షా ప్రాంగణం జనప్రవాహంతో పోటెత్తింది. లక్షలాది మంది జనం సమక్షంలో, కృష్ణమ్మ సాక్షిగా, సీతమ్మ పాదాల సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ఉదయం లక్ష్య దీక్ష పేరిట 48గంటల దీక్ష ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు, దర్గాలో దీవెనలు అందుకున్న జగన్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం కడప, కర్నూలు జిల్లాల్లో అలుపెరగకుండా పర్యటించి, రాత్రంతా రైల్లో ప్రయాణించి వచ్చిన ఆయన కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోకుండానే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. యువనేత వైఎస్సార్ ప్రాంగణానికి చేరుకునే సమయానికే ఇసుక తిన్నెల ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది నేతలు, అభిమానులు స్వాగతం పలుకుతుండగా జగన్ వేదికపైకి వచ్చి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు.


మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, వందలాది మంది నేతలు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్ ప్రాంగణానికి వచ్చి జగన్‌కు మద్దతునిచ్చారు. నందమూరి లక్ష్మీపార్వతి, రోజా, రాజశేఖర్-జీవిత దంపతులు, రాజా, విజయచందర్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై నేతల ప్రసంగాలు సాయంత్రం వరకూ సాగాయి. సాయంత్రం 4.30 గంటలకు జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు కృష్ణా తీరాన్ని హోరెత్తించారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం పదునైన పదాలతో కదనోత్సాహం రగిల్చింది.

దీక్షలో పాల్గొనేందుకు, యువనేతకు మద్దతు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వైఎస్సార్ ప్రాంగణం సగానికి పైగా నిండిపోయింది. సాయంత్రమయ్యేసరికి జనం చీమలబారుల్లా ఉవ్వెత్తున ఇసుక తిన్నెలకు చేరుకున్నారు. పాదయాత్రలు, ప్రదర్శనలుగా తరలివస్తున్న వారితో కృష్ణలంక హైవే, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్, కంట్రోల్‌రూమ్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యువనేతను చూసేందుకు పసి పిల్లలను చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి రావడం విశేషం.

జగన్ చూసేందుకు అభిమానులంతా వేదిక వద్దకు దూసుకొచ్చేశారు. పోలీసులు వారిని ఆపలేక చేతులెత్తేశారు. దీంతో వేదిక చుట్టూ వేలాది మంది జనం చేరిపోయారు. జగన్ ను పలుకరించేందుకు, చేయి కలిపేందుకు వారు తహతహలాడారు. ఇక చేసేదిలేక చాలామందిని వేదికకు అనుబంధంగా వేసిన మార్గంలోకి అనుమతించి యువనేత వద్దకు పంపారు. మరోవైపు వెనుక మార్గం నుంచి అనేక మంది వేదిక పైకి ఎక్కేశారు. పలుమార్లు నేతలతోపాటు జగన్ వారిని వారించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జి కూడా జరిగింది. ఈ గందరగోళంలో బ్యారికేడ్లు, లైట్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి వరకూ వాహనాలు అసంఖ్యాకంగా నగరంలోకి వస్తూనే ఉండడంతో ఎక్కడికక్కడ దీపతోరణాల్లా, చీమల బారుల్లా వాహనాలు, జనమే గోచరించాయి. .



ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వచ్చి జగన్‌కు మద్దతు పలికారు. వీరిలో కొందరు జగన్‌ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. మరి కొందరు దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులూ ఫోన్లో యువనేతను పలకరించి దీక్ష సక్సెస్ కావాలని అభిలషించడం విశేషం.

రైతులకోసం జగన్ ఇచ్చిన 48 గంటల దీక్ష పిలుపుకు రాష్టవ్య్రాప్తంగా లభించిన స్పందన పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా ఉంది. ప్రస్తుతానికి ఏపార్టీకీ చెందని జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా కాంగ్రెస్, పీఆర్‌పీ, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు సంఘీభావం ప్రకటించారు. మరో పదిరోజుల్లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే సమయంలో కూడా ప్రాంతాలకు అతీతంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఒంటరిని చేసి పంపాలనుకుంది. అయితే ఇప్పుడు జగన్ ఒంటరి కాదు.. లక్షలాది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జననేతగా ఆయన కృష్ణా నదీతీరంలో సీతమ్మ పాదాల సాక్షిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు దీక్షకు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన రైతులు, వరి సాగుతో కుదేలైన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ దీక్షకు హాజరయ్యారు. వీరితోపాటు చేనేత కార్మికుల సమస్యలపై జగన్ సమరభేరి మోగించడంతో ఆ వర్గం కార్మికులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

Tuesday, December 14, 2010

జగన్ వెంటే ఉంటానన్న శేషారెడ్డి

జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను సముదాయించడం, బుజ్జగించడం తంటాగా మారింది. బందరు ఎమ్మెల్యే పేర్ని నానీని ముఖ్యమంత్రి బతిమాలినా ఫలితం లేకపోయింది. ఆయన్ను ఏదో చేసి ఏదో విధంగా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాల్ని సీఎం చేస్తుండగానే తూర్పుగోదావరి జిల్లానుంచి నల్లమిల్లి శేషారెడ్డి రూపంలో మరో బాంబు పేలింది.



తన నియోజక వర్గ కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైఎస్ జగన్ యాత్రలో పాల్గొనబోతున్నట్టు శేషారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడినా శేషారెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. తన కార్యకర్తలందరూ జగన్ కే మద్దతు ఇస్తుండగా తనకు వెళ్లకుండా ఉండటం ఎలా సాధ్యమని శేషారెడ్డి సీఎం ను ప్రశ్నించారని సమాచారం. ఇదిలావుంటే ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కు బాసటగా నిల్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆది నుంచి జగన్ కుడిభుజంలా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యజించడానికి సిద్ధపడిన మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యనాయకులతో కీలక మంతనాలు సాగిస్తున్నట్లు భోగట్టా. మరోవైపు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు ముద్రగడ, జక్కంపూడి సైతం జగన్ వెంటే ఉన్నాయి. తూర్పుగోదావరి యాత్రతో జగన్ ప్రజాబలం, ఆయనకున్న రాజకీయ మద్దతు ప్రస్ఫుటం అవుతుందని అంటున్నారు.


ఈ యాత్రలో తన జన బలాన్ని ప్రదర్శించి అధిష్టానం గుండెల్లో రైళ్లు పరుగెట్టించాలని జగన్ వర్గం కదన కుతూహలంతో ఉంది. జగన్ ఎక్కడ యాత్ర చేపట్టినా జనం తండోపతండాలుగా స్వచ్చందంగానే వస్తున్నారని జిల్లా రాజకీయ నేతలు చెబుతున్నారు.

Thursday, November 11, 2010

కాంగ్రెస్ లో కుట్రపూరిత వాతావరణం


అంబటి ధ్వజం
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని మరో బహిష్కృత నేత, జగన్ వర్గంలోని ప్రముఖ నాయకుడు అంబటి రాంబాబు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరరెడ్డిపై ఈచర్య అత్యంత శోచనీయమని గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ అంబటి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వారిని, ఓదార్పుకు అనుకూలంగా కదులుతున్న నేతలను బయటకు గెంటేస్తున్నారన అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు అండగా నిలబడుతున్న నాయకులపై చర్యలు తీసుకుంటున్న అధినాయకత్వం, మరి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన ప్రశ్నించారు. పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని అధినాయకత్వం ఏకపక్ష పోకడలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.