Saturday, July 24, 2010

అతడిది ఓదార్పు మాట... వారిది బ్లాక్ మెయిలింగ్ బాట

జగన్ పై కాంగ్రెస్ ఆర్ధిక దాడి

వైయస్ జగన్ ను కాంగ్రెస్ అధిష్టానం బ్లాక్ మెయిల్ చేస్తోందా.... అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. వివాదాస్పద నిర్ణయాలను, తన వారికి కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న అంశాలను తిరగదోడుతూ ప్రభుత్వపరంగా జగన్ కు ఆయన కుటుంబ సభ్యులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి సంపదను సమకూర్చిపెడుతున్నట్లు కొందరు సీనియర్లు అధిష్టానాన్ని నమ్మించారు. దీంతో ఈ దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుల శాఖ మంత్రిగా నియమించడం గనులను కొల్లగొట్టే వ్యూహంలో భాగమేనని దుష్ప్రచారం కొందరు చేపట్టారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయడం, నైతికంగా దెబ్బ తీయడం కాంగ్రెసు అధిష్టానం దూ(దు)రాలోచనగా తెలుస్తోంది. రోశయ్య ముఖ్యమంత్రి కాగానే దీనికి నాంది పలికారు. కర్నాటక మంత్రి, వైయస్ సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల వ్యవహారంపై కూడా అధిష్ఠానం కన్నేసింది. జనార్దనరెడ్డి గనుల తవ్వకాల్లో వైఎస్ వర్గానికి వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురానికి కాంగ్రెస్ అధిష్టానం ఆసరాతో ప్రభుత్వం చెక్‌ పెట్టింది. చీమకుర్తి గ్రానైట్‌ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం. మరోపక్క ఏకపక్షంగా కొందరు అధికారుల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది,


తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి మంత్రులందరూ కాదంటున్నా సరే గట్టిగా ప్రతిపాదించడం ఆయన ధోరణికి నిదర్శనం. అయితే వైఎస్ హయాంలో జరిగిన ప్రతీ కార్యకలాపానికీ ఈ మంత్రులతో పాటు రోశయ్య కూడా బాధ్యుడే అనేది నైతికమైన విషయం. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలలో తమకూ, తమ పార్టీకి, తమ మంత్రివర్గానికీ పాత్రను వెదుక్కునే ప్రబుద్ధులు తమకేమీ తెలియనట్టు, నాటి పరిణామాల్లో అవినీతి జరిగిందంటూ ఇపుడు చర్యలకు దిగడం వారి లేకి బుద్ధికి దురుద్దేశాలకూ ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా వైఎస్ హయాంలో ఏదైనా అక్రమాలు జరిగిఉంటే రోశయ్య నుంచి సోనియా వరకూ అందరూ అందులో భాగస్తులే కావాలి..... అయితే వైఎస్ ఎంతో తపనతో అమలుపర్చిన సంక్షేమ పధకాలకు మాత్రం ఆయన ఒక్కడే కర్త, కర్మ, క్రియ అనేది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఇవాల్టి ప్రభుత్వం వైఎస్ పధకాల్ని భారంగానే భావిస్తోంది, వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది గనుక.


అంబటి సస్పెన్షన్ బాధాకరం

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు సస్పెన్షన్ చాలా చాలా బాధాకరమని యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పరిణామం తనకెంతో కలత కలిగించిందని జగన్ అన్నారు. రాజమండ్రిలోని హుకుంపేటలో ఆదివారం ఉదయం ఏడోరోజు ఓదార్పు యాత్రకు బయలుదేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి గొప్ప నాయకుడని, పార్టీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. నాన్న రాజశేఖరరెడ్డితో పాటుగా దాదాపు 1500కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అంబటి రాంబాబు పార్టీ రెండుసార్లు గెలవడం వెనుక కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబటి సస్పెన్షన్ పై అధిష్టానంతో మీరు మాట్లాడతారా అని విలేఖరులు ప్రశ్నించగా, తప్పకుండా తనవంతు పాత్ర పోషిస్తానని, తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. మీ వెనుక తిరిగేవారికి ఇది ఎటువంటి సిగ్నల్ ఇస్తుందని మీడియా ప్రశ్నిస్తే జగన్ ఆవేదన, ఆత్మవిశ్వాసాలతో స్పందించారు. తన వెనుక ఉన్నవారికి దేవుడున్నాడని, నాన్న ఆశీస్సులున్నాయని, వైఎస్ ను అభిమానించేవారి గుండెచప్పుడు తోడుందని పేర్కొన్నారు. అంబటిపై సస్పెన్షన్ చర్యను మీకు వార్నింగ్ గా భావించవచ్చా... అంటే, వార్నింగ్ తప్పు చేసేవారికి ఇస్తారు, నేనేమి తప్పు చేశానని ప్రశ్నించారు.

అంబటి సస్పెన్షన్ .... జగన్ కు పరోక్ష హెచ్చరికా?

ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేయడంతో పాటు సవాళ్లు విసిరి బహిరంగంగా పత్రికలకు ఎక్కిన అంబటి రాంబాబును కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి వీరవిధేయుడైన అంబటిపై వేటు వేయడం తాజా పరిస్థితుల్లోవ్యూహాత్మకమేనని సమాచారం. అధిష్టానం మాట కాదని యాత్ర చేస్తున్న జగన్ కు పరోక్ష హెచ్చరిక జారీచేయడమే ఈ చర్య ఆంతర్యంగా తెలుస్తోంది.


జగన్‌పై చర్యలు ఉండవని హైదరాబాద్ లో మొయిలీ ప్రకటించిన కొద్దిసేపటికే సోనియా ప్రతినిధిగా అహ్మద్ పటేల్ ఆయనతో మాట్లాడి మేడమ్ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అనంతరం గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో అధిష్టానంపై కొందరు సీనియర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్న తరుణంలో మొయిలీ వ్యాఖ్యలు జగన్ వ్యతిరేకులకు బాగా కలిసివచ్చాయి.

ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు. దీంతో సీనియర్లు కంగు తిని ఈ వివరాల్ని తక్షణం ఢిల్లీకి మోసేశారు. ఈ వ్యవహారాలపై అర్జెంటుగా చర్చించేందుకు హస్తిన రావాలంటూ అధిష్టానం రోశయ్యకు కబురు పంపింది. జగన్ వర్గీయుల జాబితా, వారి నేపథ్యాల వివరాలను కూడా పట్టుకురావాలని మేడమ్ ఆదేశించారని వినిపిస్తోంది. ఇదిలాఉండగా తనకింగా సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి చెప్పారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు రెండువారాల గడువివ్వాలని అంబటి కోరడం, దానికి పీసీసీ ఆమోదించడం తెలిసిందే. ఈ గడువు ముగియకుండానే అధిష్టానం ఇలా ఆయన్ను సస్పెండ్ చేయడం చూస్తే ఈ మధ్యలో జరిగిన పరిణామాలే కారణమని అర్ధం అవుతుంది.