Monday, December 27, 2010

ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరిన యువనేత జగన్

రెండురోజుల నిరాహార దీక్షకు రాష్ట్రంమొత్తాన్ని కదిలించి సంచలనం సృష్టించిన యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా తన పోరు ఆపదల్చుకోలేదు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాత రైతు ఎజెండానే ప్రధానంగా ఉంటుందని, తాను కూడా తండ్రి వైఎస్సార్ లాగే రైతు బాంధవుడ్నని ఆయన చాటుతున్నారు. తాజాగా జగన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంటు కోరారు. బహుశా 28,29 తేదీల్లో ఆయన డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తారు. అప్పటికి ఆయనకు అప్పాయింట్ మెంట్ కూడా వస్తుదని అంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో జగన్ ప్రధానిని కలుస్తున్నారు. కాగా రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. కేంద్రం చొరవ చూపి బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరనున్నారు. కాగా రైతు సమస్యలపై తన వ్యవహార శైలితో ఇప్పటికే ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ ఢిల్లీ యాత్ర, ప్రధానితో భేటీ తలనొప్పి తెస్తాయనడంలో సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ చాతుర్యం... కాంగ్రెస్ అధినేత్రికి ఇరకాటం

ఏకపక్షంగా నియంతృత్వ శైలిలో జగన్ విషయంలోవ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇపుడు తల పట్టుకుంటున్నారు. తన వీర విధేయుల చెప్పుడు మాటలు పట్టుకుని నిజమైన ప్రజాదరణ ఉన్న నేతలను నిరాదరించడం ద్వారా పొరపాటు చేసిన విషయాన్ని కొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె దృష్టికి తెచ్చారని అంటున్నారు. వీరిలో ప్రణబ్ ముఖర్జీ ముఖ్యులు. జగన్ విషయంలో ఆంతరంగికులు కొందరు అమెను తప్పుదోవ పట్టించారని, అయితే సోనియా కూడా వారికే విలువ ఇచ్చి జగన్ విషయంలో ఎందుకో తొందర పడ్డారని పార్టీ ముఖ్యులతో అన్నారని సమాచారం. ఈ విషయం సోనియా కోటరీలో ఇపుడు చర్చనీయాంశమైంది. వైఎస్ వ్యతిరేక వర్గం పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారానికి సోనియా ప్రభావితమయ్యారని, వైఎస్ కుటుంబం పార్టీకి చేసిన సేవల్ని హైకమాండ్ అసలు పట్టించుకోకపోవడం శోచనీయమని కొందరు పేర్కొంటున్నారు. పార్టీలో, కడప నియోజకవర్గంలో జగన్‌ను ఏకాకి చేసేందుకు హైకమాండ్ ఎత్తుగడ వేస్తే, ఇది సకాలంలో గ్రహించిన జగన్ అధిష్టానానికే దిమ్మదిరిగేలా తన రాజకీయ చాతుర్యం చూపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో, ఆత్మరక్షణలో పడింది. రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పేరు తల్చుకుంటేనే అధిష్టానానికి వణుకు పుడుతోంది. గతంలో కాంగ్రెస్ పై తోక ఝాడించిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు, ఇవాల్టి జగన్ కు ఏదో అంతరం స్పష్టంగా గోచరిస్తోంది. అతడిలో ఏదో పవర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కట్టి పడేస్తోంది. దిక్కుతోచక తలపట్టుకునేల చేస్తోంది. చివరికి బహిరంగ వ్యఖ్యలు చేసిన కొండా సురేఖ, పిల్లి సుభాశ్ చంద్రబోస్, సబ్బం హరి వంటి నేతల్ని కూడా ఏమీ చేయలేని క్రియాశూన్యత అధిష్టానాన్ని పీడిస్తోంది. సొంత పార్టీ స్థాపనకు జగన్ సన్నాహాలు ఇంకా పూర్తి కాకుండానే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం కొట్టుమిట్టాడుతోంది. జగన్‌కు తన మద్దతు ఉంటుందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బహిరంగంగా ప్రకటించారు.అధిష్టానం తనను వివరణ కోరిన అర్థ గంటలోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆయనతో కలసి రైతులను పరామర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టబోతున్న వ్యక్తితో కలసి తిరుగుతున్నా నాయకత్వం ప్రేక్షకపాత్ర వహించాల్సివచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి కూడా జగన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించినా ఏం చేయలేక పోయింది. పైగా వీరిద్దరితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా మాట్లాడి కూడా మనసు మార్చలేకపోయారు. కనీసం రాజీనామా చేయొద్దని మాత్రం సీఎం వీరిని వేడుకోవలసి వచ్చింది. తెలంగాణకు జై అంటే జగన్ కు తిరుగు ఉండదని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి చెప్పడం మరో సంచలనం. పైగా జగన్ పార్టీ విధివిధానాలు నచ్చితే పార్టీలో చేరుతానని కూడా దామోదర్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఎమ్మెల్యే కొండా సురేఖ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజారక్షణ-భద్రత కమిటీ మాజీ ఛైర్మన్‌ కేవీపీ.రామచంద్రరావును బ్రోకర్‌గా సంబోధించారు. వైఎస్ హత్యలో ఆయనకు ప్రమేయం ఉందన్నారు. అయినా సరే అధిష్టానం మిన్నకుండి పోయిందేగానీ, కనీసం షోకాజ్‌ నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయింది. జగన్‌ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని సురేఖ అంటే కనీసం పీసీసీ ఆమెను మందలించిన దాఖలాలు కూడా కనిపించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకున్నా ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న భయం నాయకత్వాన్ని వేధిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వారికి ప్రధానంగా మారిపోఇంది. జగన్‌వైపు ఎంపీలు వెళితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇబ్బందిలో పడుతుందోనని కాంగ్రెస్ బెదిరిపోతోంది.