Saturday, July 10, 2010

ఓదార్పు యాత్రకు ఎమ్మెల్యేలు సై


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొనలా వద్దా అనే అంశంపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనాలనే తీర్మానించడంతో అందరూ ఇందుకు సిద్ధపడినట్టు భోగట్టా. జగన్ వర్గానికి చెందిన వారే కాకుండా.. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇపుడు శ్రీకాకుళంలో జగన్ కు లభిస్తున జనాదరణ చూసి మేల్కొంటున్నారు. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పుకు వారు కూడా సై అంటున్నారు. యాత్రలో పాల్గొనక పోతే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారుతుందని గ్రహించారు. ఫలితంగా.. ఓదార్పులో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి కూడా సెలవు కావడంతో ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎమ్మెల్యేలు శ్రీకాకుళంకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో శుక్రవారం కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్రలో పాల్గొనే అంశమై మంతనాలు జరిపారు. అధిష్టానం ఆదేశాలను ఎవరూ ధిక్కరించవద్దని రోశయ్య మళ్ళీ చెప్పగా పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని తెలిసింది. మంత్రులైతే ప్రభుత్వంలో భాగమని, తమకా ఇబ్బంది లేదని కొందరు ఎమ్మెల్యెలు నేరుగా రోశయ్యకే చెప్పారు. మంత్రులకైతే పదవులు పోతాయని భయం ఉంటుంది.. తమకేమని వారు ప్రశ్నించినట్టు సమాచారం. యాత్రలో తాము పాల్గొనకపోతే నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవని తాము వెళితే పలకరించే నాధుడే ఉండరని వారు వాపోయారు. యాత్రలో పాల్గొనాలనే తాము నిర్ణయించుకున్నట్టు సీఎంకు తేల్చి చెప్పారు. ఇపుడు శ్రీకాకుళంతో పాటు.. తూర్పుగోదావరి జిల్లాలో 11వ తేదీనుంచి జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సిద్ధమవుతున్నారు.

No comments: