Monday, November 8, 2010

సింహగిరి సీమ నుంచి జగన్ సింహనాదం

నెల్లూరులో ఆదివారం ఓదార్పు యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభ కోసం కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సర్వశక్తులూ సమీకరించారని తెలుస్తోంది. రెండు మాసాలకు పైగా  దాదాపు 63 రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ ఆ సమయంలో  అధిష్టానంపై గానీ పార్టీలోని ప్రత్యర్ధి నాయకులపై గానీ విమర్శలేమీ చేయలేదు. ఆయన ప్రసంగాలు రొటీన్ గానే సాగుతున్నట్లు అనిపించింది. దీంతో మీడియా కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించింది. అయితే తన వర్గంపై అధిష్టానం, కొందరు వైఎస్ వ్యతిరేక పక్ష నేతలు చేస్తున్న రాజకీయ దాడి నేపధ్యంలో జగన్ నెల్లూరు సీమ నుంచి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేస్తూ తన అంతరంగాన్ని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఈ సభలో మామూలుగా కాక కాస్త కటువుగా మాట్లాడారు. ప్రతిపక్షాలను, వ్యతిరేక మీడియాను వదిలేసి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తనను ఒంటరి చేయడానికి పార్టీలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ అధిష్టానం తనను అంగీకరించే స్థితిలో లేదని తెలిసిన యువనేత తనను కాదంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో పరోక్షంగా అధిష్టానానికి చెప్పదలిచారని, అందుకే అలా మాట్లాడారని భావిస్తున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ ప్రతి అంశంలోనూ ఆయన చాలా స్పష్టంగా ఉన్నారని అంటున్నారు.

No comments: