Monday, November 8, 2010

జగన్ ఓదార్పుపై ప్రశంసల వర్షం

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం కడుపున పుట్టిన మరో సింహం అని తెలుగు దేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన కోహినూర్ వజ్రం జగన్ అని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జగనే నిజమైన హీరో అని కూడా పొగిడారు.  తండ్రి మరణానికి చలించి శ్వాస విడిచిన వారిని ఓదార్పు పేరుతో స్వయంగా వచ్చి కలుసుకోవడం ఆయన మంచితనానికి ప్రబల నిదర్శనమన్నారు. చివరి శ్వాస వరకు తాను జగన్ తోనే ఉంటానని నల్లపురెడ్డి ప్రతిన బూనారు. 
కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ  మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కాంగ్రెస్ లో వైఎస్ లేని కొరత ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళతాడని పలువురు శ్లాఘించారు. నెల్లూరులో జగన్ వర్గం బలప్రదర్శనకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన నాయకులంతా అక్కడ మోహరించారు. కొత్తగా లక్ష్మీపార్వతి, రోజా వచ్చి చేరారు. జగన్ తప్ప మరో నాయకుడు లేడంటూ రోజాతో సహా మిగతా నాయకులంతా ఎలుగెత్తి చాటారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ దాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు ఓదార్పు తర్వాత జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించడమే జగన్ విశిష్టతకు నిదర్శనమని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు ముందుకు వచ్చిన  వైయస్ జగన్ కు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. ఈ యాత్ర చరిత్రలో నిల్చిపోతుందని, ఇది రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి మంచిదని చెప్పారు.

No comments: